Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 9:29 pm Posted by : ramakrishna

విజయవాడ థార్ కేసు లో ఇద్దరికీ 14 రోజుల రిమాండ్

 

విజయవాడ, బతుకమ్మ :

 

విజయవాడలో సంచలనం సృష్టించిన “థార్ కార్ల రచ్చ” కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట హైటెన్షన్ రోడ్డుపై అర్థరాత్రి జరిగిన ప్రమాదకర ఘటనలో పాల్గొన్న ఇద్దరు యువకులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. స్టేషన్ బెయిల్ అవకాశాలు లేకుండా, రాజకీయ పైరవీలు కూడా ఫలించకపోవడంతో నిందితులను జిల్లా జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ కేసులో బొల్లా ఓంకార్‌ను ఏ1గా, రోహిత్ లింగమనేనిని ఏ2గా నమోదు చేశారు. డ్రగ్ టెస్ట్‌ లో బొల్లా ఓంకార్‌కు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో అతనిపై నార్కోటిక్ చట్టాల కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, రోహిత్ లింగమనేని ఘటన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు పలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు లభించగా, మరొక కారులో జిమ్ వినియోగానికి సంబంధించిన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఈ-సిగరెట్లు బయటపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక యువతి విషయంలో తలెత్తిన వ్యక్తిగత విభేదాలే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తు పదార్థాల ప్రభావంలో యువకులు రోడ్డుపై పరస్పరం కార్లను ఢీకొట్టుకుంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించినట్లు వెల్లడైంది. ఈ ఘటనలో రాజకీయ సంబంధాల అంశం కూడా చర్చకు వచ్చింది. నిందితుల్లో ఒకరికి రాజకీయ అండ ఉందన్న ప్రచారం జరిగినప్పటికీ, పోలీసులు కేసును వేగంగా ముందుకు తీసుకెళ్లడం గమనార్హమైంది. ప్రజల్లో భయాందోళనలు కలిగించిన ఘటనగా పరిగణించిన కోర్టు, ఇద్దరికీ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, డ్రగ్స్ వినియోగం, స్వాధీనం చేసుకున్న వస్తువులపై ఫోరెన్సిక్ నివేదికలు వెలువడాల్సి ఉంది. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.