. . . వైద్య బృందాలను అభినందించిన ప్రభుత్వం
హైదరాబాద్, బతుకమ్మ :
నిమ్స్ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో మూడు సంవత్సరాల లోపే 1,000 రోబోటిక్ – అసిస్టెడ్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ అరుదైన మైలురాయిని సాధించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్ లో నిర్వహించిన రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ పథకాల ద్వారా ఉచితంగా అందించడం విశేషమని ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించింది. ఈ విజయానికి నాయకత్వం వహించిన నిమ్స్ డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్‌తో పాటు వివిధ విభాగాల వైద్య బృందాలను ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. భవిష్యత్తులోనూ నిమ్స్ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించింది. నిమ్స్ లో రోబోటిక్ శస్త్రచికిత్సల విస్తరణ రాష్ట్రంలో ఆధునిక వైద్య సాంకేతికత వినియోగానికి మరో ముందడుగుగా నిలిచిందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.