- వ్యవస్థాపకుడు హేగ్డేవార్ పూర్వికులది ఇందూర్
- ఇందూర్ లో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమై 75ఏండ్లు
- నేడు శాఖోపశాఖలుగా విస్థరించిన ఆర్ఎస్ఎస్

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1925 లో మహారాష్ట్రలోని నాగపూర్ లో 17 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సంస్థ 2025 నాటికి భారతదేశంతో పాటు సుమారు 30 కి పైగా దేశాలలో తమ యొక్క నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ యొక్క పూర్వీకులది ఇందూర్ జిల్లా కందకుర్తి గ్రామం కావడం విశేషం. భారతదేశం పైన పదే పదే విదేశీయులు దాడులు చేయడం, మన దేశంలోని సంపదను దోచుకోవడం, తిరిగి మన మీదనే అజమాయిషీ చేయడం వంటి వాటికి మూల కారణం ఈ దేశ మూల వాసులైన హిందువులు సంఘటితంగా లేకపోవడం అని గుర్తించిన డాక్టర్ హెడ్గేవార్ హిందూ సంఘటనే ఏకైక లక్ష్యంగా 1925 విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు. అంచలంచలుగా నాగపూర్ నుంచి దేశ నలుమూలకు ఆర్ఎస్ఎస్ విస్తరించింది. మొదటి రోజున శాఖకు వెళ్లిన వారిలో ప్రస్తుతం సజీవంగా ఉన్న ఏకైక వ్యక్తి విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాల్వగడ్డ గంగాధర్ వారి యొక్క స్వీయ అనుభవాలనుంచి ఇందూరు ఆర్ఎస్ఎస్ ప్రస్తానం.

1950 లో మొట్టమొదటిసారిగా ఇందూరు నగరంలో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమైంది. ఉన్నత విద్య కోసం భాగ్యనగర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లో చదువుతున్న ఇందూరు విద్యార్థి రేణుకా రావు దేశ్ పాండే కి అక్కడ ఆర్ఎస్ఎస్ పరిచయమైంది. యూనివర్సిటీలో చురుకుగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొంటున్న ఆయన వేసవి సెలవుల సమయంలో 1950 మే నెలలో ఇందూరుకు వచ్చి ఇక్కడ శాఖ ప్రారంభించాలి అని సంకల్పించారు. ప్రస్తుతం తిరుమల థియేటర్ ఉన్న ప్రాంతం లో తుంగ చెట్లతో నిండి ఉన్న ప్రాంతంలో మొట్టమొదటిసారి శాఖ ప్రారంభించారు. ఆనాటి నగర భౌగోళిక స్థితికి ఆ ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారి శాఖను ప్రారంభించిన నాడు 12 మంది విద్యార్థులు శాఖలో పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్ కార్య విస్తరణలో ముఖ్యపాత్ర పోషించే ప్రచారకులు అప్పుడు దేశవ్యాప్తంగా అవసరం ఉన్న చోటకి వెళ్లి నిస్వార్ధంగా పనిచేసేవారు. అలా 1954 లో పూణే నగరానికి చెందిన బాల ముకుంద సావరేకర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఇందూరుకు ప్రచారక్ గా రావటం జరిగింది.వారి ఆధ్వర్యంలో శాఖల సంఖ్య విశేషంగా పెరిగింది. మొట్టమొదట శాఖను ప్రారంభించిన స్థలం వర్షాకాలంలో పూర్తిగా బురదతో నిండిపోవడంతో గాజులపేటలోని సంతాచారి మఠం ( దత్త మందిర్) లో కి శాఖా స్థలాన్ని మార్చారు. తదనంతరం ఒకే శాఖలో ఎక్కువమంది రావడంతో మరొక శాఖను ప్రారంభించాలని ప్రస్తుతం గర్ల్స్ హైస్కూల్ గా పిలవబడుతున్న కోటగల్లి లోని బాలికల పాఠశాల మైదానంలో రెండవ శాఖను ప్రారంభించారు. ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు శాఖలను విస్తరించి నగరంలో 5 శాఖలను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి నగర కార్యవాహక స్వర్గీయ రేణుకా రావు దేశ్ పాండే వ్యవహరించగా ఆ తర్వాత డాక్టర్ వసంత్ రెడ్డి తదనంతరం న్యాయవాది బెల్లాల్ మాణిక్ రెడ్డి ఆ తర్వాత ఆకుల పెద్ద చిన్నయ్య కార్యవాహలుగా బాధ్యతలు నిర్వహించారు.

ఎమర్జెన్సీ సమయంలో ఇక్కడ స్వయం సేవకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆనాటి జిల్లా ప్రచారక్ బండారు దత్తాత్రేయ ఎమర్జెన్సీ సమయంలో కూడా విస్తృతంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిర్వహించారు. కాలక్రమేనా ఆర్ఎస్ఎస్ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం ఇందూరు నగరాన్ని 55 బస్తీలుగా విభజించగా అన్ని బస్తీలలో శాఖలు ప్రారంభించి నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఎన్నో అవరోధాలు ఎన్నో ఆటుపోట్లు మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ స్వయంసేవకులు తమ కర్తవ్యం నిష్ఠ కోసం నిరంతరంగా పరిశ్రమిస్తూనే ఉన్నారు. శాఖ మాధ్యమంగా సమాజంలో పరివర్తన వ్యక్తినిర్మాణము, సమరసత ధర్మ జాగరణ కుటుంబ ప్రబోధన్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా హిందూ సంఘటనను నిరంతర యజ్ఞంగా నిర్వహిస్తున్నారు.

2024 డిసెంబర్ నెలలో ఇందూరులో నిర్వహించిన కళాశాల విద్యార్థి శిబిరం యొక్క సార్వజనికోత్సవ సందర్భంగా 1200 మంది స్వయం సేవకులు గణవేష్ ధరించి నగరంలోని మూడు వివిధ ప్రాంతాల నుంచి పథ సంచలన్ లు ప్రారంభించి ఒకే సమయంలో శివాజీ చౌక్ ప్రాంతంలో కలిసి నడవడం ఒక చారిత్రాత్మక దృశ్యం. శాఖల సంగమం పేరుతో 2024 లో 36 శాఖలు 2025 లో 55 శాఖలు ఒకే చోట ఒకే సమయంలో నిర్వహించి మరొక చరిత్రఆత్మకమైన కార్యక్రమానికి ఇందూరు వేదికైంది.ప్రస్తుతం నగరంలోని అన్ని బస్తీలలో శాఖలు నడుస్తున్నాయి. సమాజంలోని అన్ని రంగాల వ్యక్తులకు వేరువేరుగా సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాజాన్ని జాగృతం చేసే బాధ్యతను ఆర్ఎస్ఎస్ భుజాన వేసుకుంది.

కోవిడ్ మహమ్మారి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమయంలో సేవా భారతి పేరుతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. సామాజిక సమరసతా వేదిక పేరుతో సమాజంలోని పీడిత వర్గాల ప్రజలకు చేరువై వారిలోని ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించి హిందువులందరూ సహోదరులు అనే భావనను నిర్మాణం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 2024 అఖిల భారత స్థాయిలో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ ప్రకటించే నివేదికలో ఇందూరు నగరానికి చెందిన నీలకంఠేశ్వర ఉద్యోగి శాఖ యొక్క విశేష కార్యక్రమాల గురించి ప్రస్తావన జరిగింది. ఈ అరుదైన ఘనతను తెలంగాణ ప్రాంతాల్లో సాధించిన ఏకైక నగరంగా ఇందూరు నిలిచింది. ప్రస్తుతం క్రియాశీల స్వయం సేవకులు 3000 మంది ఉండగా సంఘ యొక్క అనుబంధ సంస్థల ద్వారా 50,000 మందికి పైగా కార్యకర్తలు వివిధ రంగాల్లో జాతీయ భావ దృక్పథంతో పనిచేస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ తమ యొక్క కార్యక్రమాల కోసం ఎక్కడ ఎవరిని విరాళాలు అడగకుండా కేవలం తమ కార్యకర్తలు సంవత్సరంలో ఒకరోజు తాము గురువుగా భావించే భగవాద్వజానికి ప్రనామ్ చేసి తమ యొక్క సంపాదనలో సమాజ కార్యం కోసం తమ వంతు కృషిగా ధనాన్ని సమర్పిస్తారు. ఆ డబ్బుతోనే ఆర్ఎస్ఎస్ తన యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందూరులో మాధవ స్మారక సేవాసమితి పేరుతో యువతులకు కుట్టు శిక్షణా కార్యక్రమాలు అనేక ఆరోగ్య శిబిరాలు, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ వంటి ఎన్నో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్నారు.

కరోనా సమయంలో ఉచితంగా 20 ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను శివ భారతి ఆధ్వర్యంలో కోవిడ్ చికిత్స పొందలేని నిరుపేదల కోసం ఇంటింటికి పంపించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ సూచించిన పంచ పరివర్తన కార్యక్రమాల ఆధారంగా సమాజంలో పౌరుల యొక్క విధులు, సామాజిక సమరసత కుటుంబ ప్రబోధన్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా విస్తృతంగా రానున్న సంవత్సర కాలం పాటు ప్రతి హిందూ గృహాన్ని ప్రత్యక్షంగా సంపర్కం చేయనున్నట్లు తెలిపారు.

జనవరిలో నిర్వహించే హిందూ సమ్మేళనాలు ప్రతి వీధి వీధిలో జరుగుతాయని ప్రతి హిందువు కుటుంబ సమేతంగా ఈ సమ్మేళనాలలో పాల్గొని ప్రపంచానికి హిందూ ఐక్యత శక్తిని తెలియజేయాల్సిన అవసరం ఉందని కోరారు. విజయదశమి సందర్భంగా నగరంలోని 55 బస్తీలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు పదివేల మంది హిందువులు పాల్గొన్నారు. రానున్న సంవత్సర కాలం పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను రకరకాల కార్యక్రమాల రూపంలో కలుపుతూ ఈ శతాబ్ది సంవత్సరాన్ని రానున్న హిందూ శతాబ్దానికి ఆహ్వానం పలుకనున్నారు.
