. . . డీఐజి ఐజీల అధ్వర్యంలో విచారణ
. . . జిల్లా జైలులో సుదీర్ఘ రహస్య విచారణ
. . . అధికారుల విచారణ నివేదిక ప్రకారమే చర్యలు
. . . రేపోమాపో ఉత్తర్వులు
నిజామాబాద్,బతుకమ్మ :
నిజామాబాద్ సెంట్రల్ జైలులో అధికారులు విచారణ జరపడం కలకలం రేగింది. ఈ నెల 3న జైళ్ళ శాఖ డీఐజీ సంపత్ ,ఐజి మురళీబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు సాగింది. నిజామాబాద్ జిల్లా జైలు ఉన్నపుడు 72 మంది ఖైదీలు పారిపోయిన తర్వాత సెంట్రల్ జైలుగా అప్ గ్రేడ్ పొందిన నిజామాబాద్ జైళ్ల శాఖ సుధీర్ఘ విచారణ జరగడం విశేషం.
గడిచిన నెలలో నిజామాబాద్ సెంట్రల్ జైలులో గంజాయి రావడం కలకలం రేసింది. గంజాయి వాడకం,గంజాయి వాడిన ఇద్దరు ఖైదీలపై జైలు అధికారులు దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట గంజాయి వినియోగం రవాణా జైళ్ల శాఖలోని కలకలం రేపింది. గంజాయి సరఫరా వినియోగంపై విచారణ చేయాల్సిన అధికారులు ఖైదీలను చితకబాదడంతో వారు గాయపడి మెజిస్ట్రేట్ వద్ద తమపై జైలు అధికారులు ఝలుం గురించి ఫిర్యాదు చేశారు. జైలులో ఖైదీల హక్కులకు భంగం కలగడమే కాకుండా అధికారుల అధికార దుర్వినియోగం అవినీతి కారణమని నిర్ధారించిన మెజిస్ట్రేట్ జైళ్ల శాఖ ఉన్నత అధికారులకు సిఫారసు చేశారు. గత కొన్ని నిజామాబాద్ సెంట్రల్ జైలులో పని చేస్తున్న అధికారుల అవినీతి హద్దు లేకుండా సాగింది. సొంత శాఖ ఉద్యోగి పైనే వేధింపులు బహిర్గతమైన వాటిని కప్పిపుచ్చారు. అదే మాదిరిగా జైలుకు వచ్చే ఖైదీలను, రిమాండ్ ఖైదీలను, శిక్ష పడిన ఖైదీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వెల్లడయింది. అంతే కాకుండా జైలులో ములాఖాత్ కోసం వచ్చే వారి నుంచి కూడా ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం వారికే చెల్లింది. దాంతో పాటు ఖైదీలకు బీడీలు,సిగరెట్లు,పాన్ మసాలాలు ఇవ్వాలంటే కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జైలుకు వచ్చిన ఖైదీలను అవసరం లేకున్నా వైద్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం కోసం డబ్బులు గుంజుతున్నారని వాదనలు ఉన్నాయి.
మొత్తం మీద రాష్ట్రంలో సెంట్రల్ జైల్లో అత్యధిక ఖైదీలు ఉన్న జైళ్ల శాఖ అధికారుల అవినీతి చర్చనీయాంశంగా మారింది. జైళ్ల శాఖ అలస్యంగా మేల్కొని దిద్దు బాటు చర్యలకు ఉపక్రమించింది. జైలులో జరుగుతున్న అక్రమ వసూళ్లపై అవినీతి నిరోధక శాఖ నజర్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. అందుకే జైళ్ల శాఖలో కీలకమైన డీఐజీ,ఐజీ స్థాయి అధికారులతో విచారణ సుదీర్ఘంగా జరిగిన సంబందిత నివేదికపై ఎలాంటి చర్యలు ఉంటాయానన్న ఉత్కంఠ నెలకొంది. జైళ్ల శాఖ పై వచ్చిన అవినీతి మరకలను తుడిచి వేసుకునేందుకు ఖచ్చితంగా వేటు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 3న జరిగిన విచారణ నివేదిక ప్రకారం జైళ్ల శాఖ డీజీపీ చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధానంగా జిల్లా జైల్లో గత కొన్ని రోజులుగా అడ్డాగా చేసుకుని వసూళ్లకు ఎగబడుతున్న ముగ్గురు కీలక అధికారులపై చర్యలు తప్పవని ఉద్యోగులు చెబుతున్నారు. నిజామాబాద్ సెంట్రల్ జైలును ప్రక్షాళన దిశగా చర్యలు తప్పకుండా తీసుకుంటారని ఉద్యోగ వర్గాలు గంటాపదంగా చెబుతున్నారు. మొత్తానికి గంజాయి ఉదంతంతో బహిర్గతమైన అవినీతి అక్రమాలపై సెంట్రల్ జైలులో ప్రక్షాళన అవుతుందా లేదా అనేది అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పాలి.
